జీవితం అనే పుస్తకం
మానవజాతి చరిత్ర మీలోనే ఉంది – ఎన్నో అనుభవాలూ, ప్రగాఢమైన భయాలూ, ఆందోళనలూ, సుఖదుఃఖాలూ, యుగయుగా లుగా మనిషి కూడబెట్టుకున్న నమ్మకాలూ-మీరే ఆ పుస్తకం. దాన్ని ఏ ప్రచురణ కర్తా ప్రచురించలేదు. దాన్ని కొనుక్కోవడానికి కుదరదు. మీరు ఏ విశ్లేషకుడి దగ్గరికీ పోనక్కర్లేదు. అతని పుస్తకమూ మీదీ ఒక లాంటిదే కనుక. ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా, ఓపిగ్గా, మెల్లిగా చదవకుండా, మీరుంటున్న ఈ అవినీతికరమైన, నీతి బాహ్యమైన సమాజాన్ని ఎన్నటికీ మార్చలేరు. పేదరికం, అన్యాయం మొదలైనవి ఎంతగానో ఉన్నాయి. అరాచకం, అవినీతి, యుద్ధం – అన్నిటికన్నా మహానేరం యుద్ధం – వీటితో నిండిన ప్రస్తుత ప్రపంచంలోని పరిస్థితులను గురించి లోతుగా ఆలోచించే ఏ వ్యక్తి అయినా బాధపడతాడు. మన సమాజంలోనూ, దాని వ్యవస్థలోనూ సమూల పరివర్తన తీసుకు రావడానికి, ఎవరైనా ఈ పుస్తకాన్ని, అంటే తనగురించే చదవగలిగి ఉండాలి. మనం ఉంటున్న సమాజాన్ని మనలోని ప్రతి ఒక్కరూ, మన తల్లి దండ్రులూ, తాత ముత్తాతలూ, ఇంకా అందరూ సృష్టించారు. మానవులందరూ ఈ సమాజాన్ని సృష్టించారు. సమాజాన్ని మార్చకపోయినట్లయితే, అవినీతి ఇంకా ఎక్కువవుతుంది, యుద్ధాలు ఇంకా ఎక్కువవుతాయి, మనిషి మనస్సు పూర్తిగా విధ్వంసమైపోతుంది. అందుచేత తానే అయిన తన పుస్తకాన్ని చదవాలంటే ఆ పుస్తకం ఏమని చెబుతోందో వినేకళ ఉండాలి. వినడం అంటే ఆ పుస్తకం చెబుతున్న దానిపై వ్యాఖ్యా నించడం కాదు. ఊరికే పరిశీలించడమే. ఒక మేఘాన్నో, తాటి ఆకులు గాలికి ఊగుతుంటేనో, సూర్యాస్తమయం అందాన్నో చూచినట్లు; దాన్నేమీ మార్చలేరు. అందుచేత ఆ పుస్తకం ఏమని చెబుతోందో వినే కళ ఉండాలి. ఆ పుస్తకం మీరే; అది అంతటినీ ఆ విష్కరిస్తుంది.
ఇంకొక కళ ఉంది – పరిశీలించడం అనే కళ – చూడటం అనేకళ. మీరే అయిన మీ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు, మీరూ పుస్తకమూ వేరుగా ఉండరు. పాఠకుడూ, పుస్తకమూ మీరూ వేరు కాదు. ఆ పుస్తకం మీరే.
మరొక కళ కూడా ఉంది – నేర్చుకోవడం అనేకళ. కంప్యూటర్లు నేర్చుకోగలవు; వాటిని కార్యక్రమానుసారంగా తీర్చిదిద్దవచ్చు. వాటికి చెప్పినట్లుగా అవి తిరిగి చేస్తాయి. మనం ముందు అనుభవాన్ని పొందుతాం, జ్ఞానాన్ని పోగుచేస్తాం, మెదడులో నిక్షిప్తం చేస్తాం. అప్పుడు ఆలోచనలు జ్ఞాపకాలుగా ఏర్పడతాయి. అప్పుడు చర్య తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న చర్య నుంచి మీరు నేర్చుకుంటారు. ఆ విధంగా నేర్చుకోవడం అంటే మరికొంత జ్ఞానాన్ని కూడ బెట్టడం. తెలుసుకుని, మేలుకొని ఉన్న మనస్సు ఎప్పుడూ చేసేపని అదే కంప్యూటర్ లాగ. అనుభవం, జ్ఞానం, జ్ఞాపకం, ఆలోచన, చర్య తీసుకోవడం – అదే మనమంతా ఎప్పుడూ చేస్తున్నది-దాన్నే నేర్చుకోవడం అంటున్నాం- అనుభవం నుంచి నేర్చుకోవడం. ఇదే మానవుని కథ-నిత్యం ఒక సమస్య, ఆ సమస్యకి ప్రతిస్పందన. ఈ పుస్తకంలో మానవజాతి గురించి సమస్త జ్ఞానం ఉంది-అది మీరే.
మీరు చాలా విద్వాంసులనీ, విద్యా వంతులనీ నాకు తెలుసు; కానీ దీనంతటినీ నేను చాలా చాలా సరళమైన భాషలో పెడుతున్నాను. అయితే మాట వస్తువు కాదు. దీన్ని నిత్యం మీ మనసులో ఉంచుకోండి – మాట వస్తువు కాదు. చిహ్నం ఎన్నటికీ వాస్తవం కాదు. అందుచేత, నేనన్నట్లుగా, చూడటం అనే కళ ఉంది, వినడం అనే కళ ఉంది, నేర్చుకోవడం అనే కళ ఉంది. మనిషి తెలిసిన దాన్నుంచి తప్పించు కోలేడు. అందుచేత మనం నేర్చుకోవడం యాంత్రికమైపోతుంది. నేర్చుకోవడం అనే కళ అంటే దీనికి పూర్తిగా భిన్నమైనది అని అర్థం.
నేర్చుకోవడం అంటే జ్ఞానానికి ఉన్న పరిమితుల గురించి శోధించడం, ఆపైన ముందుకి సాగడం. ఇప్పుడు, ఈ మూడు ప్రక్రియలతో – వినడం, పరిశీలించడం నేర్చుకోవడం – వీటితో జీవితం అనే పుస్తకాన్ని మనం కలిసి చదువుదాం. మీరు నాతో కలిసి ఆ పుస్తకాన్ని చదువు తున్నారు; మీ పుస్తకాన్ని నేను చదవడం లేదు. మనం మానవుని పుస్తకాన్ని చదువుతున్నాం – అది మీదీ, ఉపన్యాసకుడిదీ, మానవజాతి అంతటిదీ. దీని పట్ల కొంచెం శ్రద్ధవహించండి. మనమే ఈ పుస్తకం కనుక, దీన్ని చదవడం ఎలాగో మనం తెలుసుకుంటే అన్ని సంఘర్షణలూ, అన్ని కష్టాలూ అంత మవుతాయి. అటువంటి మనస్సే ధార్మిక మనస్సు – నమ్మకాలున్న మనస్సుకాదు – కర్మకాండలన్నీ చేసే మనస్సు కాదు – స్వేచ్ఛగా ఉన్న మనస్సు. పుస్తకం అంతా చదివినప్పుడు, అటువంటి మనస్సుకే సత్యం వరంగా లభిస్తుంది.
ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయం ఏమిటి? ఇది మీ పుస్తకం. అందులోని మొదటి అధ్యాయంలో ఉన్న విషయం ఏమిటి? భౌతిక అస్తిత్వం, భౌతిక నిర్మాణం – భౌతిక శరీరానికి ఉన్న సాధక బాధకాలన్నీ రోగాలు, బద్ధకం, మందకొడితనం, సరియైన ఆహారం లేక పోవడం, సరియైన పోషణ లేకపోవడం – మొదలైనవన్నీ కాకుండా, మొట్టమొదటి కదలిక ఏమిటి? మీ ముఖాన్ని మీరు చూసుకునే ఉంటారు – తల దువ్వుకోవడం, ముఖానికి ‘పౌడరు’ అద్దుకోవడం వంటివన్నీ. కానీ, మీలోకి మీరు ఎప్పుడూ చూసుకుని ఉండరు. మీలోకి మీరు చూసు కున్నట్లయితే మీరు ఇతరుల్ని అనుకరించే మనిషి అని మీ అంతట మీరు కనిపెట్టరా? ఇతరుల్ని అనుకరించే మనిషి అని అనుకోవడం అంత సంతోషం కలిగించక పోవచ్చు. కానీ మనం ఇతరులు అందించిన జ్ఞానంతో నిండి ఉన్నాం – ఎవరో, ఏ గురువో, ఏ గురువు చెప్పినదో, బుద్ధుడు చెప్పినదో, క్రీస్తు చెప్పినదో – ఇంకేదో – దానంతటితో నిండి ఉన్నాం. అంతేకాక, మీరు పాఠశాలకీ, కళాశాలకీ, విశ్వవిద్యాల యానికీ వెళ్లినట్లయితే, అక్కడ కూడా మీరేది చెయ్యాలో, ఏమని ఆలోచించాలో మీకు చెప్పి ఉంటారు. అందుచేత మీరు అనుకరించే మనిషి అని తెలుసుకున్నట్లయితే, అప్పుడు మీ మనస్సులోని అనుకరించే లక్షణాన్ని అవతల పెట్టి చూడవచ్చు.
దయచేసి గమనించండి: మొదట పరిశీలించినది మనం వైరుధ్యంతో జీవిస్తున్నామనీ, మనలో ఒక క్రమ వ్యవస్థ అనేది లేదనీ. క్రమ వ్యవస్థ ఒక విపులమైన ప్రణాళిక కాదు. క్రమ వ్యవస్థ అంటే ప్రతిదాన్నీ దానికి తగిన స్థానంలో ఉంచడం. అయితే, క్రమ పద్ధతి ఒక అలవాటు ప్రకారం పాటించే యాంత్రిక క్రమశిక్షణ, యథాక్రమంగా చేసే కర్తవ్య నిర్వహణ కన్నా మహత్తరమైనది. అందుచేత ఆ పుస్తకంలోని మొదటి అధ్యాయంలో కనిపెట్టే విషయం – మనం విపరీతమైన గందర గోళంతో కూడిన, క్రమరహితమైన జీవితాన్ని గడుపుతున్నామన్నది – ఒకటి కోరుకోవడం, దాన్ని కోరలేదనడం, చెప్పడం ఒకటి, చేయడం మరోటి, ఆలోచించడం ఒకటి, ఆచరించడం మరోటి. ఆ విధంగా నిత్యం వైరుధ్యం ఉంటుంది. వైరుధ్యం ఉన్నప్పుడు సంఘర్షణ ఉండి తీరుతుంది. మీరు ఆ పుస్తకాన్ని – అంటే మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు క్రమ రహితమైన వ్యవస్థలో జీవిస్తున్నారనీ, మీరు నిరంతర సంఘర్షణలో ఉన్నారనీను. ఆ సంఘర్షణ – ఆకాంక్షగా, నెరవేర్చు కోవడంగా ఒక వ్యక్తితోనో, దేశంతోనో, భావంతోనో తాదాత్మ్యం చెందడంగా వ్యాపిస్తుంది – వాస్తవంతో ఎప్పుడూ జీవించడం ఉండనే ఉండదు. ఆ విధంగా మనం రాజకీయంగానూ, మతపరంగానూ, కుటుంబ జీవితంలోనూ క్రమ రాహిత్యంలో జీవిస్తున్నాం.
క్రమ వ్యవస్థ అంటే ఏమిటో మనం కనుక్కోవాలి. ఆ పుస్తకమే మీకు చెబుతుంది. దాన్ని ఎలా చదవాలో మీరు తెలుసుకుంటే మీరు క్రమరహితంగా జీవిస్తున్నారని చెబుతోందది. దాన్ని అనుసరించి తరువాత పుట తిప్పండి. అప్పుడు మీరు కనిపెడతారు క్రమ రాహిత్యంలో జీవించడం అంటే ఏమిటో. క్రమ రాహిత్యం స్వభావం ఏమిటని – మేధా పరంగానో, మాటల్లోనో కాకుండా – యదార్థంగా అర్థం చేసుకున్నట్లయితే, ఆ పుస్తకం అంటోంది – దాన్ని అనువ దించకండి, దాన్ని మేధాపరమైన భావంగా మార్చకండి, సవ్యంగా చదవండి. అలా చదివినప్పుడు, అది చెబుతుంది – మీలో వైరుధ్యా లున్నాయనీ, వైరుధ్యం స్వభావాన్ని అర్థం చేసుకున్నట్లయితేనే అవి అంతరించగలవనీను. హిందువులూ, ముస్లిములూ, యూదులూ, ఆరబ్లూ, కమ్యూనిస్టులూ, కమ్యూనిస్టులు కానివారూ అనే విభజన ఉన్నప్పుడు – వివిధ రకాలైన బౌద్ధ, హిందూ, క్రిష్టియన్, మొదలైన మతాలకు చెందిన వారి మధ్య ఈ నిరంతర విభజన ప్రక్రియ ఉన్నప్పుడు వైరుధ్యం కూడా ఉంటుంది. విభజన ఉన్నచోట సంఘర్షణ ఉండి తీరుతుంది – అదే క్రమరాహిత్యం. క్రమ రాహిత్యం స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ఆ అవగాహనలోనుంచి – క్రమరాహిత్యాన్ని ప్రగాఢంగా అర్థం చేసుకోవడం లోనుంచి క్రమవ్యవస్థ సహజంగా పుట్టుకొస్తుంది.
క్రమవ్యవస్థ ఒక పుష్పంలా సహజంగా వికసిస్తుంది. ఆ క్రమ వ్యవస్థ – ఆ పుష్పం ఎన్నటికీ వాడిపోదు. విభజన ఉన్నచోట సంఘర్షణ ఉండి తీరుతుందని తెలిపే పుస్తకం చదవడం వల్ల, జీవితంలో ఎప్పుడూ క్రమ వ్యవస్థ ఉంటుంది.
తరవాత అధ్యాయం ఇలా చెబుతుంది – మీరు ఒక కేంద్రం నుంచి పరిధివైపుగా పని చేస్తున్నంతవరకూ వైరుధ్యం ఉండి తీరుతుంది అని. అంటే, మీరు స్వలాభంతో, స్వార్థపూరితంగా, అహంకార పూరితంగా, వ్యక్తిగతంగా, విస్తారమైన ఈ జీవితాన్నంతటినీ ‘నేను’ అనే స్వల్పమైన దాంట్లో సంకుచిత పరిచినట్లయితే మీరు క్రమ రాహిత్యాన్ని సృష్టించి తీరుతారు. ‘నేను’ అనేది ఆలోచన తెచ్చిపెట్టిన అతి స్వల్ప విషయం. ఆలోచన చెబుతుంది – నా పేరు, రూపం, మానసిక నిర్మాణం, తన చుట్టూ తాను చేసుకున్న రూప కల్పన – ‘నేను ఫలానా’ అని. స్వలాభంతో కూడిన కార్యకలాపం ఉన్నంత వరకూ వైరుధ్యం ఉండి తీరుతుంది, క్రమరాహిత్యం ఉండి తీరుతుంది. ఇక, స్వలాభం లేకుండా ఎలా ఉండటం అని అడగవద్దు అంటుందా పుస్తకం. మీరు అలా అడగడం ఒక విధానంకోసం అడగడం అవుతుంది. ఒక విధానాన్ని అనుసరిస్తే, అది మరోరకమైన స్వలాభంతో కూడిన కార్యక్రమం అవుతుంది. ఆ పుస్తకం ఇదంతా చెబుతోంది. ఇదంతా నేను చెప్పడం లేదు. ఉప న్యాసకుడు ఆ పుస్తకాన్ని మీ కోసం అనువదించడం లేదు – మనం కలిసి చదువుతున్నాం దాన్ని. మీరు ఏదైనా శాఖకో, వర్గానికో, మతానికో చెందినంత కాలం మీరు సంఘర్షణ సృష్టించి తీరుతారు. దాన్ని దిగమింగడం కష్టం – ఎందువల్లనంటే, మనందరం ఏదో ఒకదాన్ని నమ్ముతాం. మీరు దేవుణ్ణి నమ్ముతారు, మరొకరు నమ్మరు; ఇంకొకరు బుద్ధుణ్ణి నమ్ముతారు, వేరొకరు ఏసు క్రీస్తుని నమ్ముతారు. ఇస్లాం ఇంకొకటేదో ఉందంటుంది. అందుచేత, ఈ వమ్మకం మనిషికీ మనిషికీ మధ్య ఉన్న సంబంధంలో విభజన తెస్తోంది. వాస్తవాలతోనే మీకు పని అనుకున్నప్పుడు నమ్మకం పెట్టుకోవలసిన అవసరం ఉండదు. వాస్తవం అంటే మీ పుస్తకంలో వాస్తవంగా జరుగుతున్నది.
ఇక అప్పుడు ఆ పుస్తకాన్ని మీరు ఎలా చదువుతున్నారు మీరు ఆ పుస్తకమూ వేరు వేరా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మీరు ఒక నవలనో, ఉద్వేగపరిచేరచననో తీసుకున్నప్పుడు దాన్ని మీరు ఒక పరాయివ్యక్తిగా చదువుతారు – పుట ఒక్కొక్కటే తిప్పుతుంటారు.
ఉత్తేజకరమైన కథ, మొదలైనవాటి కోసం. కానీ ఇక్కడ పాఠకుడే పుస్తకం. తనలోని ఒక భాగాన్ని చదువుతున్నట్లుగా దాన్ని చదువుతాడు; ఏదో పుస్తకం చదువుతున్నట్లు కాదు. ఆ పుస్తకం ఇంకా ఇలా చెబుతుంది మనిషి ఎప్పుడు రాజకీయమైనదో, మత పరమైనదో, ఒక నాయ కుడిదో, గురువుదో, జ్ఞానిదో, మేధావిదో, తత్వవేత్తదో, ఎవరో ఒకరి అధికారం కింద జీవిస్తాడు. అతడు ఎప్పుడూ ఒక అధికారం నమూనాని అనుసరిస్తాడు. పుస్తకం ఏమని చెబుతుందో చాలా జాగ్రత్తగా వినండి : న్యాయవ్యవస్థకి అధికారం ఉంటుంది – మీరు అంగీకరించినా, అంగీ కరించక పోయినా, న్యాయవ్యవస్థకి అధికారం ఉంటుంది – పోలీసుకి అధికారం ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఒక నియంతకీ అధికారం ఉంటుంది. మనం ఆ అధికారం గురించి మాట్లాడు కోవడం లేదు. మనస్సు భద్రతకోసం కోరుకునే అధికారం గురించి ఆ పుస్తకంలో చదువుతున్నాం.
మనస్సు ఎప్పుడూ భద్రత కోరుతూ ఉంటుంది. ఆ పుస్తకం చెబుతుంది – మానసికంగా మీరు భద్రతని కోరుకుంటున్నప్పుడు మీరు ఒక అధికారాన్ని – మత గురువు అధికారాన్నో, కల్పితరూపం యొక్క అధికారాన్నో, ‘నాకు జ్ఞానోదయం కలిగింది, నేను చెప్పేది వినండి’ అని అంటున్న వ్యక్తి అధికారాన్నో – సృష్టించి తీరుతారు. అందుచేత అది ఏమని చెబుతుందంటే, అటువంటి అధికారాన్నంతటి నుంచీ స్వేచ్ఛగా ఉండండి – అంటే, మీకు మీరే జ్యోతిగా ఉండండి. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరిపైనా ఆధారపడకండి. ఆ పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరిపైనా ఆధారపడకండి. ఆ పుస్తకాన్ని చదవడానికి, మీకూ ఆ పుస్తకానికీ మధ్య ఎవరూ లేరు – తత్త్వవేత్తగాని, మతగురువు గాని, గురువుగాని, దైవంగాని ఏదీ లేదు. మీరే ఆ పుస్తకం. మీరు దాన్ని చదువుతున్నారు. అందుచేత, ఇంకొకరి అధికారం నుంచి స్వేచ్ఛ ఉండాలి. ఆ అధికారం భర్తదైనా, భార్యదైనా సరే. అంటే, దాని అర్థం, ఒంటరిగా నిలబడగలగాలి అని.-
ఆ పుస్తకం అంటుంది – మీరు చర్చించారు, మీరు మొదటి అధ్యాయంలో క్రమరాహిత్యం గురించీ, క్రమవ్యవస్థ గురించీ, అధికారం గురించీ చదివారు. తరవాత అధ్యాయం చెప్పేది – జీవితం అంటే సంబంధం. జీవితం అంటే క్రియా పూర్వక సంబంధం అని. మీరు సన్నిహితంగా ఉంటున్న వారితో సంబంధం ఉండటమే కాకుండా, మొత్తం మానవజాతితో మీకు సంబంధం ఉంది. మీరు ఇతర మానవుల్లాంటివారే- వారెక్కడ జీవిస్తున్నా. ఎందువల్లనంటే, వాళ్లూ బాధపడుతున్నారు, మీరూ బాధపడుతున్నారు. అలాగే అన్నీ. మానసికంగా మీరే ప్రపంచం, ప్రపంచమే మీరు. అందువల్ల మీకు మహత్తరమైన బాధ్యత ఉంది. అప్పుడు ఆ పుస్తకం చెబుతుంది తరవాతి అధ్యాయంలో మనిషి అనాది మంచీ భయంతో బతికాడు – భయం ప్రకృతీ, పరిసరాలూ, రోగాలూ, ప్రమాదాలూ మొదలైన వంటే మాత్రమే కాదు, ఇంకా ప్రగాఢమైన స్థాయిల్లో భయం – ప్రగాఢమైన, అచేత నావస్థలోని, ఎవరూ స్పృశించని భయతరంగాలు. మనం ఆ పుస్తకాన్ని అధ్యాయం పూర్తి అయేవరకూ చదువుదాం. అది చెబుతుంది – ‘దాన్ని గమనించండి – మీరు దాన్ని అంతం చెయ్యగలుగుతారు’ అవి. ఆ పుస్తకం మళ్లీ చెబుతుంది తరవాతి పుటలో. భయం అంటే ఏమిటి? అది ఎట్లా పుడుతుంది, దాని స్వభావం ఏమిటి? ఆ సమస్యను మానవుడు ఎందువల్ల పరిష్కరించలేక పోయాడు? దానితో ఎందుకు జీవిస్తున్నాడు? దానికి అలవాటు పడిపోయాడా? దాన్ని జీవిత విధానంగా అంగీకరించాడా? మనిషి – మానవునిగా ఆ సమస్యని పరిష్కరించుకొని, మనస్సుని భయం నుంచి పూర్తిగా స్వేచ్ఛగా ఎందువల్ల చేయలేక పోయాడు? భయం ఉన్నంత వరకూ మీరు అంధకారంలో జీవిస్తారు.
మీ భక్తి ఆ అంధకారం నుంచి వచ్చినదే. అందువల్ల భక్తి పూర్తిగా అర్థరహితమైనది.
భయం స్వభావాన్ని ఇంకా కొంత చదవడం చాలా ముఖ్యం. అయితే, భయం ఎలా ఉత్పన్నమవుతుంది? గతించి పోయినవాటి జ్ఞాపకం వల్లనా- ఏదో బాధగురించి జ్ఞాపకం; మీరు చేసిన ఏదోపని-మీరు చెయ్యకుండా ఉండాల్సినది; మీరు చెప్పిన అబద్ధం, అది బయటపడటం మీకు ఇష్టం లేదు, అది బయటపడుతుందేమోనని భీతి చెందుతున్నారు; మీ మనస్సుని కలుషితం చేసిన చర్య, ఆ కాలుష్యం అంటే మీకు భయం, ఆ చర్య అంటే భయం లేదా, భవిష్యత్తు గురించి మీకు భయం కావచ్చు, లేదా, మీ ఉద్యోగం పోతుందన్న భయం కావచ్చు, లేదా, మీ దేశంలో ఏ చిన్న మూలో ఒక ప్రముఖ పౌరుడిగా కాలేదనో కావచ్చు. మనకి అసంఖ్యాకమైన భయా లున్నాయి. జనానికి అంధకారం అంటే భయం. జనానికి ప్రజాభి ప్రాయం అంటే భయం, జనానికి మరణం అంటే భయం, జనానికి విజయవంతం కాకపోవడం గురించి భయం – దాని అర్థం ఏమైనా కానివ్వండి. ఇంకా, రోగం గురించి భయం; విపరీతమైన శారీరక బాధ అనుభవించినప్పటి భయం – ఆ బాధ మనస్సులో స్థిరపడి ఉంటుంది – ఆ బాధ మళ్లీ కలుగుతుందేమోనన్న భయం. అందుచేత ఆ పుస్తకం చెబుతుంది; పదండి, ఇంకా చదవండి; భయం అంటే ఏమిటి? ఆలోచన తెచ్చిందా దాన్ని కాలం తెచ్చిందా దాన్ని? ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను, కానీ నేను వృద్ధుణ్ణి అయితే, నేను రోగగ్రస్థుణ్ణి అవుతానని భీతిచెందుతున్నాను. అదీ కాలం అంటే. లేదా, ఆలోచన అంటుంది – నాకేదైనా సంభవించవచ్చు. నేను నా ఉద్యోగం పోగొట్టు కోవచ్చు, నేను గుడ్డివాణ్ణి కావచ్చు. నేను నా భార్యని కోల్పోవచ్చు. ఏదైనా కావచ్చు. అదే భయానికి మూల కారణమా? – ఆ పుస్తకం మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. అందుచేత మీరేమంటారు – పుటని తిప్పమని మీలోనే మీకు సమాధానం దొరుకుతుంది. ఉపన్యాసకుడు మీకు చెప్పడం లేదు. అదే చెబుతుంది – ఆలోచనా, కాలమూ భయానికి కారణాలు అని. ఆలోచనే కాలం అని చెబుతుంది.–
ఆ తరవాతి పుట ఇంకా ఇలా చెబుతుంది; మనిషి మనస్సుకి సాధ్యమేనా – ఆ పుస్తకాన్ని, అంటే మీరే అయిన ఆ పుస్తకాన్ని చదువుతున్న మీరు భయం నుంచి పూర్తిగా – ఒక్క రవ్వంతయినా లేకుండా – స్వేచ్ఛగా ఉండటం సాధ్యమేనా? అది మళ్లీ అంటుంది; ఒక విధానం కోసం అడగకండి. విధానాలంటే పదేపదే చేయడం; ఒక వ్యవస్థ. మీరు సృష్టించిన విధానం భయాన్ని పరిష్కరించదు. ఎందు చేతనంటే, మీరు ఆ విధానాన్ని అనుసరిస్తారు భయం స్వభావాన్ని అర్థం చేసుకోకుండా. కాబట్టి ఒక విధానం కోసం వెతకకుండా భయం స్వభావాన్ని అర్థం చేసుకోండి. అది ఏమిటి చెబుతుంది. అర్థం చేసుకోవడం అంటే ఏమిటి? పద నిర్మాణాన్ని అంటే ఆ పదం అర్థాన్ని తెలుసుకోవడం – అదొక మేధా పరమైన ప్రక్రియ, లేదా, దానిలోని సత్యాన్ని చూడటం. ఈ సత్యాన్ని చూసి నప్పుడు, (మీ అంతట మీరు దాన్ని స్పష్టంగా చూసినప్పుడు అది మాయమవుతుంది. ఆలోచనా, కాలమూ భయానికి కారణాలని – మాటల వివరణగా కాకుండా, ఆది మీలోని భాగంగా – అది మీ రక్తంలో, మీ మనస్సులో, మీ హృదయంలో కాలమే కారణం అని మీ అంతట మీరే స్పష్టంగా చూసినప్పుడు అప్పుడు భయానికి స్థానం ఏమాత్రం లేదనీ, కాలానికే ఉందనీ గ్రహిస్తారు. ఎందువల్లనంటే, భయాన్ని తెచ్చినది కాలమూ, ఆలోచనా కాబట్టి. ఏం సంభవిస్తుందో అన్న భయం నాకు, నా ఒంటరి తనం అంటే భయం నాకు – ఒంటరితనాన్ని నేనెప్పుడూ పరీక్షించను – దాని అర్థం ఏమిటని – కానీ అదంటే భయం నాకు, అందుకని నేను – దాన్నుంచి పారిపోతాను. కానీ ఒంటరితనం నా నీడ – అది నన్ను వెంటాడుతుంది. మీ నీడ నుంచి మీరు పారిపోలేరు. అందుచేత మీకు పరిశీలించడానికి – అంటే, పారిపోకుండా పరిశీలించ డానికి, చూడ టానికి, వినడానికి – ఆ పుస్తకం చెబుతున్నది వినడానికి సహనం ఉంటే, అది చెబుతుంది – కాలమే కారణం – భయం కాదు, అందుచేత కాలాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాలాన్ని అర్థం చేసుకున్నట్లయితే, అప్పుడు బహుశా భయానికి అంతం ఉండవచ్చు.
ఆ పుస్తకం మిమ్మల్ని అడుగుతోంది – కాలానికీ ఆలోచనకీ సంబంధం ఏమిటో కనుక్కోమని తెలిసిన దాన్నుంచి తెలియని దానికి జరిగే చలనమే ఆలోచన. అదొక చలనం – పాత జ్ఞాపకాలు వర్త మానాన్ని కలుసు కోవడం, తమని తాము మార్చుకుని, కొనసాగడం. ఈ చలనం – నిన్నటి నుంచి ఈ రోజుకీ, రేపటికీకాలం కదలడం, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయానికి. మానసిక కాలం అనేది కూడా ఉంది. అదేమిటంటే, నాకు బాధ తెలుసు, అది నాకు మళ్లీ కలగకూడదని ఆశిస్తాను, అది మళ్లీ రావచ్చు – అది గతం నుంచి వర్తమానానికి వచ్చి తన్నుతాను మార్పు చేసుకుని భవిష్యత్తులోకి కదులుతుంది. గడియారం సూచించే కాలం ఉంది. అంతర్గతమైన కాలం ఉంది. ఏదో ఆవాలని ఆశిస్తారు, కారు; అయినా ఆశిస్తారు. మీరు హింసాత్మకంగా ఉంటారు, కానీ మీరు అహింసాయుతంగా ఉండాలని ఆశిస్తారు. మీరు దురాశా పరులు, అసూయాపరులు, కానీ క్రమంగా, పరిణామ క్రమంలో, దాన్ని వదిలించుకోవాలని ఆశిస్తారు. కాబట్టి కాలం గతం నుంచీ వర్తమానం నుంచీ భవిష్యత్తుకి జరిగే చలనం. ఆలోచన కూడా గతం నుంచి వచ్చేదే – జ్ఞానం, జ్ఞాపకం, చలనం. కాబట్టి కాలం అంటే ఆలోచన.
తరవాత ప్రశ్నకి సమాధానం ఇంకా కష్టం. మీరు అంతదాకా కొనసాగడానికి మీకు సహనం ఉండాలి. నేను ‘సహనం’ అనే మాటని ఒక ప్రత్యేక అర్థంలో వాడుతున్నాను. సహనం అంటే కాలం లేకుండా ఉండటం. సాధారణంగా సహనం అంటే; మెల్లిగా వెళ్లడం, ఓపిక పట్టడం, సమయం తీసుకోవడం, వెంటనే ప్రతి స్పందించకపోవడం, శాంతంగా ఉండటం, తేలిగ్గా తీసుకోవడం, ఎదుటివారికి తమ అభి ప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశాన్నివ్వడం, వగైరా వగైరా. మనం ‘సహనం’ అనే మాటని ఆ అర్థంలో వాడటం లేదు. మనం చెబుతున్నది – సహనం అంటే కాలాన్ని మరిచిపోవడం – చూడగలగడానికీ, పరిశీలించగలగడానికీ. కాలం ఉండి, దాని ద్వారా పరిశీలిస్తున్నట్లయితే, మీకు అసహనం కలుగుతుంది. అధ్యాయాన్ని చదవడానికి మీకు సహనం అవసరం కావచ్చు. కాలం భయానికి కారణం. ఆలోచన అంటే కాలం. ఆలోచన పనిచేస్తున్నంతవరకూ మీరు భయపడి తీరుతారు.
తరవాతి అధ్యాయం చెబుతుంది; కాలాన్ని ఆపడం అనేది ఉంటుందా? కాలానికి అంతం ఉందా? మన జీవితంలో కాలం మహత్తరమైన విషయం – నేను కాను, కానీ నేను అవుతాను; నాకు తెలియదు, కానీ నేను తెలుసుకుంటాను, ఈ ఫలానా భాష నాకు తెలియదు, కానీ కొంత వ్యవధి ఇస్తే నేను నేర్చు కుంటాను. కాలం మన గాయాల్ని మాన్పుతుంది. కాలం సున్నితత్వాన్ని మొండిగా చేస్తుంది. కాలం సంబంధాన్ని నాశనం చేస్తుంది. కాలం అవగాహనని నాశనం చేస్తుంది – ఎందుకంటే అవగాహన తక్షణం జరిగేది కనుక, అంతేగాని ‘అర్థం చేసుకోవడం నేర్చుకుంటాను’ అని కాదు. అందుచేత ఆ పుస్తకం చెబుతోంది – మన జీవితంలో కాలం అసాధారణమైన ముఖ్యపాత్ర వహిస్తోందని. మన మెదళ్లు కాలక్రమంగా పరిణామం చెందాయి. అది మీ మెదడో, నా మెదడో కాదు- మానవుని మెదడు – ఆ మానవుని మెదడే మీరు. ఆ మెదడుని మీ మెదడుగా, మీ మనస్సుగా-అను కుంటున్నారు కానీ అది మీ మనస్సూ, మీ మెదడూ కాదు మానవుని మెదడు యుగయుగాలుగా పరిణామం చెందుతూ వచ్చింది. చూడండి, ఆ మెదడు కాలానికి నిబద్ధమై ఉండటం వల్ల కాలంతోనే పనిచేస్తుంది. మనం ఆ మెదడుని పూర్తిగా భిన్నంగా చెయ్య మంటున్నాం. ఆ పుస్తకం చెబుతోంది – మీ మెదడు, మీ మనస్సు కాలంతో పని చేస్తాయని. కాలం మీ జీవితంలో ప్రముఖ పాత్ర వహించింది. కాలం ఏ సమస్యకీ పరిష్కారం కాదు – సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన వాటికి తప్ప. కాలాన్ని ఏ సమస్యకీ – మీకూ మీ భార్యకీ, మీకూ మీ ఉద్యోగానికీ, ఇలా దేనికైనా పరిష్కారంగా ఉపయోగించకండి. ఇది అర్థం చేసుకోవడం కష్టమే. మీరు దీని మీద మనస్సు పెట్టండి – ఆ పుస్తకాన్ని సరిగ్గా చదవడానికి.
కనుక, అది చెబుతోంది. కాలం అంతం కాగలదా? మీ దాన్ని అంతం చేయక పోతే, భయం కొనసాగుతుంది – దాని పర్యవసానా లన్నింటితో పాటు. అది ఇంకా చెబుతుంది. ఎలా అంతం చెయ్యాలని అడక్కండి. దాన్ని, ఎలా అంతం చెయ్యాలని ఎవరినీ అడగకూడదు. అతడు ఆ పుస్తకాన్ని చదవలేదు. అతడు మీ కిచ్చేది సిద్ధాంతం మాత్రమే. మీకు ఇది అర్థమవుతోందా అని నా అనుమానం. ఇదే విజమైన ధ్యానం. కాలం ఎప్పటికైనా ఆగిపోతుందా అని విచారించడం ధ్యానం. ఈ ఉపన్యాసకుడు చెప్తున్నాడు. – ఆలా జరగ గలదనీ, జరుగుతుందనీను. ఉపన్యాసకుడు చెబుతాడు, కానీ మీ పుస్తకం కాదు. ఉపన్యాసకుడు చెప్తున్నాడు అది అంతమవుతుందని, పుస్తకం చెప్పడం లేదు. కానీ, మీరు మీ పుస్తకాన్ని నమ్మితే, మీరు ఆ పుస్తకాన్ని చదువు తున్నట్లు కాదు. మీరు కేవలం మాటల మీద జీవిస్తున్నారు. మాటల మీద జీవించడం భయాన్ని కరిగించదు. అందుచేత మీరు కాలం అనే పుస్తకాన్ని చదవాలి – దానిలోకి ప్రవేశించి, కాలం స్వభావాన్ని – ఆ కాలానికి మీరు ఎలా ప్రతిస్పందిస్తారో, మీ సంబంధం కాలం మీద ఎలా ఆధార పడిందో పరిశోధించండి. అందులోకి వెళ్ళండి. జ్ఞానం అంటే కాలం అని తెలు స్తుంది. పురోభివృద్ధికి సాధనంగా, మీరు జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లయితే, మీరు కాలంలో చిక్కుకు పోయారన్నమాట. అందువల్ల భయం, ఆందోళన, ఆ మొత్తం ప్రక్రియ అంతా కొనసాగుతుంది. కాలాన్ని అంతం చెయ్యడం ఎలాగో విచారించడానికి మనస్సు నిశ్శబ్దంగా ఉండాలి – పరిశీలించడానికి మనస్సు స్వేచ్చగా ఉండాలి. భీతి చెందకుండా ఉండాలి. మీలోని కాలగమనాన్నీ, మీరు దానిపై ఎలా ఆధారపడి ఉన్నారోనన్న దాన్నీ పరిశీలించడానికి స్వేచ్ఛ ఉండాలి. మీకు తెలుసా, ఎవరైనా మీతో, అసలు ఆశ అనేది లేదని చెబితే మీరు భయంతో వణికి పోతారు, పడరూ? నేను చెబుతున్నది మీరు అర్థం చేసుకుంటున్నారా? ఆశ అంటే కాలం.
అందుచేత మీరు కాలం స్వభావాన్ని పరిశోధించి మీ మెదడూ. మీ మనస్సూ, మీ హృదయం – అన్నీ ఒకటే – అవి కాలంతో పని చేస్తున్నాయని తెలుసుకోవాలి. అవి కాలానికి నిబద్ధమై ఉన్నాయి. అందుచేత మీరు పూర్తిగా భిన్నమైన మరోదానిని అడుగుతున్నారు. మీరు మెదడునీ, మనస్సునీ వేరే విధంగా పనిచేయమని అడుగు తున్నారు. అప్పుడు మీరు చదవడంలో అత్యంతమైన సావధానత
చూపవలసి వుంటుంది.
– కొలంబో
